Achamanam Moyens achamanam rituel hindouiste, Achaman tradition hindouiste, procédure de achamanam, achamanam

పూజలు, వ్రతాల్లో '' ఆచమనం '' అనే మాట చాలాసార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు. అందుకే '' ఆచమనం '' అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రోజులో అనేకసార్లు చేయొచ్చు, చేయాలి. ముఖ ప్రక్షాళన అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూచేతులూ కడుక్కున్న తర్వాత - ఇలా ఎన్నిసార్లు అయినా ఆచమనం చేయొచ్చు.
ఆచమనం ఎవరైనా, ఎపుడైనా చేయొచ్చు కానీ, చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో '' గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ '' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి కానీ, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు.
ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు. బాగానే ఉంది. అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి? అలా ఎందుకు తాగాలి? ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు? మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి? నీరు కొంత ఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది? « కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా. » అని మాత్రమే ఎందుకు చెప్పాలి? - ఇలాంటి సందేహాలు కలగడం సహజం. దేవుడు, ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా.
అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం.
మన గొంతు ముందుభాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.
ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.
ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఇలా లోపలినుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.
« కేశవాయ స్వాహా » అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. « నారాయణాయ స్వాహా » అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది.
ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటిద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.
ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పెగులవరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.
ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.
achamanam rituel hindouiste, Achaman tradition hindouiste, procédure de achamanam, mantra achamanam, achamanam sandhyavandanam